రాబోయే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల కొండా సుష్మిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “Upcoming Parkala MLA” అని రాసి ఉన్న ఒక స్టోరీని షేర్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
పరకాల నియోజకవర్గంపై కొండా కుటుంబానికి మొదటినుంచీ ప్రత్యేక అనుబంధం ఉంది. రాబోయే ఎన్నికల్లో తన కూతురు కొండా సుష్మిత పరకాల నుంచే పోటీ చేస్తుందని బీసీ నేత కొండా మురళి గతంలో పలు వేదికలపై బహిరంగంగానే ప్రకటించారు. స్థానికంగా కూడా ఆమె నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే, కొద్దిరోజుల క్రితం పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ — వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అధిష్టానం మద్దతు రేవూరికే ఉందనే విధంగా సంకేతాలు ఇచ్చారు.
సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కొండా సుష్మిత తన సోషల్ మీడియాలో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గానికి, కొండా వర్గానికి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మళ్లీ బహిర్గతం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.టికెట్ కేటాయింపుపై అధిష్టానం నిర్ణయం ఏమిటనేది కాలమే నిర్ణయించాలి, కానీ ఈ పోస్ట్ మాత్రం పరకాల కాంగ్రెస్‌లో రాజకీయ వేడిని రాజేసింది.
Also Read:ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం..సుప్రీం నో!

