హీరోయిన్ మెహ్రీన్ కౌర్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ.. హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మెహ్రీన్.. ఇటీవల పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు, ఆ తర్వాత హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడైన భవ్య బిష్ణోయ్‌తో అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్థం కూడా జరుపుకుంది. అయితే మెహ్రీన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. భవ్య బిష్ణోయ్‌తో తను పెళ్లిపీటలు ఎక్కడం లేదని, నిశ్చితార్థంకు బ్రేకాఫ్ చెప్పినట్లుగా మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
‘‘నేను మరియు భవ్య బిష్ణోయ్ కలిసి.. మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదు. ఇది మేమిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమే. ఇప్పటి నుంచి భవ్య బిష్ణోయ్‌తోగానీ, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గానీ నాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఈ విషయంపై ఇక నేను ఎటువంటి ప్రకటన చేయదలుచుకోలేదు. దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించి, అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. ఇకపై నటిగా కొనసాగాలని భావిస్తూ.. నా తదుపరి ప్రాజెక్ట్‌లు అలాగే నటిగా మెప్పించేందుకు ఎదురుచూస్తున్నాను..’’ అని మెహ్రీన్ తన ట్వీట్‌లో పేర్కొంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఐదేళ్ళ కింద నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంది. కొన్నేళ్లుగా ఈమె కెరీర్ అంతగా జోరు మీద లేదు. ఏడాదికి ఒక్క సినిమాలో కూడా కనిపించడం లేదు మెహ్రీన్. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది మెహ్రీన్. అయితే ఎఫ్ 2 లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సినిమాలో విలన్ పాత్రలోనూ మెప్పించింది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో మాత్రమే నటిస్తుంది మెహ్రీన్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది మెహ్రీన్. ఇప్పుడు ఈ భామ పెళ్లి ఆగిపోయింది.