మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి నుండి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న చిరు నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టాలీవుడ్‌లోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారని తెలుస్తోంది. సినీ పెద్దలు సీఎంను కలవాలని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లారు.. నాని సీఎం జగన్ కు ఈ విషయం తెలుపగా.. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం రెడీ అవుతోంది. సీఎం జగన్‌ను కలవనున్న వారిలో అక్కినేని నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.
కాగా,కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే అవకాశం ఇవ్వాలనీ, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలనీ, అదే విధంగా గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు.. కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని ముఖ్యమంత్రి జగన్‌ను కోరేందుకు చిరంజీవి బృందం సన్నద్ధమవుతోందని సమాచారం.