తెలంగాణ బిడ్డ మౌజం అలీ ఖాన్‌కు అరుదైన గౌరవం..

102
MD Moujam Ali Khan
- Advertisement -

అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎం.డీ. మౌజం అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బిడ్డ అయిన మౌజం అలీ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మౌజం అలీ ఖాన్‌ను బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఒక లక్ష 40 వేల మంది సభ్యులు ఉన్న అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్యకు మౌజం అలీ ఖాన్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ సందర్భంగా ఎం.డీ. మౌజం అలీ ఖాన్ మాట్లాడుతూ.. అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటిచెబుతానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అత్భుతమైన ఫలితాలను ఇస్తోందని, హరితహారం నినాదాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. హరిత నిధి అంశం చారిత్రాత్మకమైందని ఆయన కొనియాడారు. అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల రహదారులకు ఇరువైపుల ( ఎవెన్యూ ప్లాంటేషన్ ) మొక్కలను నాటి సుందరంగా మార్చిన విషయాన్ని ఆయన చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఉద్యమంగా చేపట్టిన అర్బన్ పార్క్స్ లు, హరిత వనాలను అభివృద్ధి చేసే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని, రాష్ట్ర అర్బన్ పార్క్స్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నగర్ వన్ ( నగర వనం ) పేరిట గత ఏడాది ప్రారంభించి పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోందని మౌజం అలీ ఖాన్ వివరించారు. దేశ వ్యాప్త అటవీ అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్లు, సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతామని మౌజం అలీ ఖాన్ పేర్కొన్నారు.

- Advertisement -