స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా త్వరలో ప్రారంభించనున్న వార్డులవారిగా నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములై విజయవంత చేయాలని కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల ప్రతినిధులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. వార్డులవారిగా చేపట్టనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ నిర్వహణపై నేడు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగరంలోని 150 వార్డులలో ఒక్కో వార్డుకు రెండు లేదా మూడు రోజులపాటు విస్తృత శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన పనికిరాని వస్తువుల సేకరణ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో దాదాపు 250 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించామని వెల్లడించారు. ఇదేమాదిరిగా భవన నిర్మాణ వ్యర్థాల చైతన్య కార్యక్రమాలను ప్రారంభించనున్నామని అన్నారు. ఈ వార్డులవారి శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టే తేదీలను త్వరలోనే ప్రకటించనున్నామని పేర్కొన్నారు. అయితే భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకుగాను ప్రతి సర్కిల్‌లో ఒక డిపాజిట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు సేకరిస్తున్న 5,600 మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థాల్లో దాదాపు 40శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయని తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ నిషేద కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వార్డులవారి ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణపై సర్కిల్, జోనల్ స్థాయిలో కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Mayor Bonthu Rammohan Review Meeting On Exclusive Sanitation Program…