జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు రాష్ట్ర మరాఠా సమాజ్ ప్రకటించింది. ఈ మేరకు మరాఠా సమాజ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో కలిసి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న తీర్మానం ప్రతిని అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరాఠా సమాజ్ కు చెందిన వారిలో దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారని సమాజ్ నాయకులు తెలిపారు.
మరాఠా సమాజ్ సొంత ఖర్చులతో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం ఐదు వాహనాలను ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు మరాఠా సమాజ్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షులు మదన్ జాదవ్, నివాస్ నిక్కం, కార్యదర్శి ఎల్.కే.షిండే లు వినోద్ కుమార్ కు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 21 డివిజన్ లలో మరాఠా సమాజ్ తరఫున సమన్వయం చేసేందుకు 15 మందిని కోఆర్డినేటర్లుగా నియమించామని, వీరంతా టీఆర్ఎస్ అభ్యర్థులకు మరాఠా సమాజ్ ఓట్లు పడే విధంగా కృషి చేస్తారని వారు పేర్కొన్నారు.
రాంగోపాల్ పేట, సనత్ నగర్, బేగంపేట డివిజన్స్ లలో మరాఠా సమాజ్ నుంచి ప్రకాష్ పాటిల్, ఆనంద్ పాటిల్, దాదా సాహెబ్ కోడెక్ లను కోఆర్డినేటర్లుగా నియమించామని వారు తెలిపారు. మైలార్ దేవ్ పల్లి, రంగారెడ్డి నగర్, జగద్గిరిగుట్ట, అత్తాపూర్, మెహదీపట్నం డివిజన్స్ లలో మదన్ జాదవ్, సునీల్ మురారే, మారుతి గైక్వాడ్, గౌలిపురా, శాలిబండా డివిజన్స్ ఇంచార్జీగా చంద్రకళ, దినేష్ అంబారే లను, కొత్తపేట, సరూర్ నగర్, ఆర్.కే.పురం, వనస్థలిపురం, హయత్ నగర్ డివిజన్స్ ఇంచార్జీ లుగా నివాస్ నిక్కం, హరీష్ కొనాలి, కాచిగూడ, గోశామహల్, మంగల్ హట్ డివిజన్స్ ఇంచార్జీలుగా ఎల్.కే. షిండే, అశోక్ పండ్రే, చింతల డివిజన్ ఇంఛార్జిగా దత్త భాల్కే లను నియమించినట్లు వారు వినోద్ కుమార్ కు వివరించారు.
సమన్వయంతో పని చేసి టీఆర్ఎస్ కార్పొరేటర్ లను భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని మరాఠా సమాజ్ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మరాఠా సమాజ్ నాయకులు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వినోద్ కుమార్ కు అందజేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మరాఠా సమాజ్ కు వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా పాల్గొన్నారు.