ఆర్టికల్‌ 370 రద్దు..మావోల బహిరంగ లేఖ

504
maoists
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై బహిరంగ లేఖ రాశారు మావోయిస్టులు. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖను విడుదల చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేసిన భారత ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక ఫాసిస్టు చర్యకు వ్యతిరేకంగా, కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా ముందుకురండి! గొంతు ఎత్తండి! లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

కేంద్రంలో రెండవసారి అధికారం చేపట్టిన బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 5 ఆగస్టున భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కాకుండా ఐక్యరాజ్యసమితి తీర్మానాలన్నింటినీ బహిరంగా ఉల్లంఘిస్తూ కశ్మీర్ కు ప్రత్యేక హెూదాను కల్పించే 370, 35-ఎ అధికరణాలను రద్దు చేస్తూ ఫాసిస్టు చర్యను ప్రకటించింది. ఆ వెనువెంటనే జమ్మూ-కశ్మీర్ ను చట్ట సభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఫ్ ను చట్ట సభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజిస్తూ జమ్మూ-కశ్మీర్ పునర్నిర్మాణ బిల్లును పార్లమెంటు రెండు సభల్లోనూ ఆమోదింప చేసింది. రాష్ట్రపతి సంతకంతో దాన్ని చట్టంగా మార్చివేయడం జరిగింది.

కశ్మీర్ లోయకు చెందిన వేర్పాటువాద నాయకులను, పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్డీ) తదితర పార్టీల నాయకులందరినీ జైళ్ళల్లో లేదా ఇండ్లల్లో బందించి, కశ్మీర్ అంతటా 144వ సెక్షన్ మరియు కర్ఫ్యూ విధించి, మొబైల్, ఇంటర్ నెట్ సేవలను ఆపివేసి, బయటి ప్రపంచంతో అన్ని రకాల కంటాక్టులను తెంపివేసి, కశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక అధికారాలన్నింటినీ కాలరాచి ఈ క్రమాన్ని పూర్తి చేయడం జరిగింది.

కశ్మీర్ లోయలో ముందునుండే ఉన్న 5 లక్షల అర్థ సైనిక, సైనిక బలగాలకు తోడు అదనంగా మరో 70 వేల బలగాలను మోహరించి కశ్మీర్ ప్రజలు తమ వ్యతిరేకతను, నిరసనను ప్రదర్శించే అన్ని మార్గాలను మూసివేయడం జరిగింది. వాళ్లను వాళ్ల ఇళ్లలో నుండి బయటకు రానివ్వడం లేదు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లు, మీడియా హౌజ్లను, ప్రభుత్వ సంస్థలన్నింటిని మూసి వేయడం జరిగింది. గత 15 రోజుల నుండీ ఈ క్రమం కొనసాగుతున్నప్పటికీ కశ్మీర్ ప్రజలు పై నిషేధాజ్ఞలు అన్నింటిని, పెల్లెట్ గన్ల కాల్పులను గేలి చేస్తూ, మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి వెళ్లేటప్పుడు, అకస్మాత్తుగా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో వందలాది మంది గాయపడుతున్నారు.

భారత దోపిడీ పాలకవర్గాలు కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాట కాంక్షను కాలరాచే, వారి అస్తిత్వం, గుర్తింపు, ఆత్మగౌరవాలను అంతం చేసే చర్యలో భాగంగా 370, 35-ఎ అధికరణాలను రద్దు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మా పార్టీ కశ్మీర్ ప్రజల విడిపోయే హకుతో సహా స్వయం నిర్ణయాధికారాన్ని ఎత్తిపడుతుందని ప్రకటిస్తోంది. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాటంలో మా పార్టీ, పీఎల్జీఏ, విప్లవ ప్రజా కమిటీలు, జనతన సర్కార్లు, ప్రజాసంఘాలు, విప్లవ ప్రజానీకం వారి వెంట ఉంటుంది.

వాస్తవానికి బహుళ జాతుల, బహుళ మతాల భారత దేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చే ఆర్ఎస్ఎస్ ప్రకటిత ఎజెండా అమలుకు ప్రారంభంగా భాజపా ప్రభుత్వం కశ్మీర్ ను మొదటి లక్ష్యం చేసుకుంది. ఇందులో భాగంగానే 370 అధికరణాన్ని రద్దు చేసి ప్రత్యేక హెూదా కలిగిన రాష్ట్రాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. కశ్మీర్ అభివృద్ధి పేరుతో 35-ఎ అధికరణాన్ని రద్దు చేసి, లద్దాఫ్ ను కశ్మీర్ నుండి వేరు చేసి, కశ్మీరేతరులను, ముస్లిమేతరులను కశ్మీర్ లోయలోకి తరలించి, తమ గడ్డపైనే కశ్మీర్ ప్రజలను మైనార్టీలు గావించే, వాళ్ల భూముల నుండి వారిని బేదఖలు గావించే, కశ్మీర్ ప్రజా సంపదలను, ప్రకృతి వనరులను దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టే కుట్రకు ఏక కాలంలో పాల్పడుతున్నది.

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ భవితను నిర్ణయించుకునే కశ్మీర్ల హక్కును, ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, చివరకు కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద విషయాలను భారత్-పాకిస్థాన్ ఇరు పక్షాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమోదించిన సిమ్లా ఒప్పందాన్ని తుంగలో తొక్కి భారత ప్రభుత్వం ఏకపక్షంగా కశ్మీర్ పై తన అధికారాన్ని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గొంతెత్తాల్సిన అవసరం ఉంది.

హిందూ ఫాసిస్టుల తర్వాత లక్ష్యం, మా పార్టీ నాయకత్వంలో సాగుతున్న విప్లవోద్యమమే. వర్గపోరాటం ప్రజాయుద్ధం ద్వారా భూస్వామ్య, దేశీయ, విదేశీ కార్పొరేటు దోపిడీని అంతం చేసి నూతన ప్రజాస్వామిక రాజ్యాధికారాన్ని స్థాపించే దిశగా ముందడుగు వేస్తూ, పంచాయితీ, ఏరియా, డివిజన్ స్థాయి విప్లవ ప్రజా కమిటీల అధికారాన్ని అమలు చేస్తున్న దండకారణ్యం, బీహార్-జార్ఖండ్ సహా దేశవ్యాప్త ఉద్యమ నిర్మూలన కోసం మే, 2019 నుండి కొనసాగుతున్న ప్రతీఘాతుక దాడి పథకం ‘సమాధాన్’ బహుముఖ దాడులను తీవ్రం చేయడంలో భాగంగానే రానున్న 26 ఆగస్టున దేశీయ వ్యవహారాల మంత్రి అమిత్ షా మా పోరాట ప్రాంతాల పోలీసు, అర్థ సైనిక బలగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నాడు. ఈ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి.

తమ హిందూ రాష్ట్ర ఎజెండాకే మోదీ ‘నయా భారత్’ పేరు పెట్టి 2022 వరకు దాన్ని సాధించే లక్ష్యం పెట్టుకున్నాడు. మోదీ కల్పనలోని ‘నయా భారత్’ నిజానికి దేశంలో ఉన్న వివిధ జాతులను అణచివేసే జాత్యహంకార పూరితమైన, హిందూ మతోన్మాద, ఉన్నత కులాధిపత్య, దళితులను పీడించే, దేశభక్తి పేరుతో దేశ ప్రజల సంపదలను, వనరులను దేశీయ, విదేశీ కార్పొరేట్ ఘరానాలకు చిల్లి గవ్వలకు అమ్మివేసే దేశద్రోహ పూరితమైనదిగా, ఉంటుంది.

మోదీ మొదటి ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ముస్లింలు, క్రైస్తవులు,బౌద్దులు మొదలైన మత మైనార్టీలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, మహిళలు, వీరందరినీ సమర్థిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రగతిశీల, ప్రజాస్వామిక మేధావులే హిందూ ఫాసిస్టుల దాడులకు లక్ష్యమనేది స్పష్టమయ్యింది. వీరి ఆర్థిక, రాజకీయ, సమాజిక, సాంసృతిక జీవితానికి చెందిన అన్ని పార్శ్వాలను-అన్న పానీయాలు, ఆచారవ్యవహారాలు, కట్టు-బొట్టు, పండుగలు-పబ్బాలు, పూజలు-పునస్కారాలు అన్నింటిని మార్చివేసేందుకు, నియంత్రించేందుకు, అంతమొందించేందుకు పథకం ప్రకారం నిరంతరం దాడులు చేస్తున్నారు.

మా పార్టీ దండకారణ్యం సహా మొత్తం దేశంలోని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రగతిశీల -ప్రజాస్వామిక మేధావులు, హక్కుల సంఘాలు, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు, పీడిత జాతుల ప్రజలు అందరికీ ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందుకు రావలసిందిగా పిలుపునిస్తోంది. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కశ్మీర్ కు ప్రత్యేక హెూదాను కల్పించే రాజ్యాంగంలోని 370, 5-ఎ అధికరణాలను రద్దు చేయడానికి వ్యతిరేకంగా గొంతెత్తాలి. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా ఉన్నాయని ప్రకటించాలి. జమ్ము-కశ్మీర్ పునర్నిర్మాణ చట్టం, 2019 ని వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయండి. రోడ్లపైకి వచ్చి ఊరేగింపులు, సభలు, ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించాలి. మోదీ నయా భారత్-హిందూ ఫాసిస్టు భారత నిర్మాణ పరికల్పనకు వ్యతిరేకంగా అన్ని పీడిత జాతులకు విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికారానికి హామీ ఉండే నూతన ప్రజాస్వామిక భారత/నూతన ప్రజాస్వామిక రిపబ్లిక్ల సమాఖ్య కోసం అందరూ కల్సి పోరాడాలని కోరారు వికల్ప్‌.

- Advertisement -