ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ‘పొలిటికల్ క్లియరెన్స్’ నిరాకరించడంపై ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ పరిణామాన్ని రాష్ట్రానికి రాజకీయ దౌత్యపరమైన అవమానం గా బిఆర్ఎస్ అభివర్ణించింది.
బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంగ్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం మరియు ఆయన పర్యటన కార్యక్రమాలు పదవికి తగినట్లుగా లేవని MEA వ్యాఖ్యానించడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి గత పర్యటనలో ‘స్వచ్ఛ బయో’ అనే సంస్థతో రూ. 1,000 కోట్ల అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.
ఈ సంస్థ ఆయన సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డికి చెందినదని, ఒప్పందానికి కేవలం రెండు నెలల ముందే ప్రారంభించిన ఈ షెల్ కంపెనీలో ఎలాంటి ఉద్యోగులు లేరని ఆరోపించారు. ఇది అవినీతి కాదా? అధికార దుర్వినియోగం కాదా? అమెరికాలో రేవంత్ రెడ్డి ఎలాంటి ఫ్యామిలీ బిజినెస్ నడుపుతున్నారు? ఇదేమైనా హవాలా వ్యాపారమా?” అని ప్రశ్నిస్తూ, దీనిపై తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:ట్రంప్‌తో వాణిజ్య చర్చలు రద్దు!
కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ…ముఖ్యమంత్రులు లేదా ఇతర ముఖ్యనేతల విదేశీ పర్యటనలకు రాజకీయ కోణంలో అనుమతి ఇచ్చే ముందు వారు పాల్గొనే కార్యక్రమాలు వారి హోదాకు తగినట్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంలో అమెరికా పర్యటన కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా లేకపోవడం వల్లే అనుమతి నిరాకరించామని స్పష్టం చేశారు. అయితే ఆయన బ్రిటన్ (UK) పర్యటనకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

