అమెరికా, కెనడాల మధ్య గత కొంతకాలంగా తలెత్తుతున్న వాణిజ్య వివాదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. చివరి నిమిషంలో జరిగిన రాయబార చర్చలు సైతం విఫలమవడంతో, చారిత్రక మిత్రదేశాలైన ఈ రెండింటి మధ్య బంధం తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడియన్ ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కెనడా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే దాదాపు 5 శాతం వస్తువులపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీటిలో హాకీ స్టిక్స్ నుండి వైద్యరంగంలో ఉపయోగించే టంగ్ డిప్రెసర్ల వరకు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఒప్పందం వీగిపోవడంపై యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ మాట్లాడుతూ కెనడా కొత్త డిమాండ్లు తీసుకురావడం మరియు గతంలో ఒప్పుకున్న అంశాల నుండి వెనక్కి తగ్గడం వల్లే చర్చలు విఫలమయ్యానని ఆరోపించారు.
అమెరికా వైఖరిపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ అత్యంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరి నిమిషంలో అమెరికా ప్రతిపాదించిన షరతులు కేవలం అన్యాయమైనవి మాత్రమే కాక, ఆర్థికంగా ఎంతమాత్రం అసంబద్ధమైనవని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందాల విషయంలో అమెరికా ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటుందనే సందేహాలను కూడా ఈ ప్రతిపాదనలు రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ దేశంలోని కార్మికులు, వ్యాపార వర్గాలను ఆదుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రత్యేక ఆర్థిక సహాయక చర్యలను ప్రకటిస్తామని కార్నీ వెల్లడించారు. గతేడాది ఉభయ దేశాల మధ్య దాదాపు 880 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వ్యాపారం జరిగిన నేపథ్యంలో, ఈ సుంకాల విధింపు వల్ల ఆర్థిక నష్టం కంటే కూడా రాజకీయంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ఈ సుంకాలు బుధవారం నుంచే అమలులోకి రావలసి ఉన్నప్పటికీ, ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ మరో మూడు రోజుల గడువు ఇచ్చారు. అయినప్పటికీ ఉభయ పక్షాలు ఒక ఐక్యమత్యానికి రాకపోవడంతో పరిస్థితి విషమించింది. నిజానికి కెనడియన్ వుడ్ దిగుమతులు, కెనడా డైరీ మార్కెట్ వంటి అంశాలపై దశాబ్దాలుగా వివాదాలు ఉన్నప్పటికీ, ఇరు దేశాలు బలమైన భాగస్వాములుగానే కొనసాగాయి. అయితే, అమెరికాలో తయారీ రంగాన్ని పెంచే నెపంతో ట్రంప్ అవలంబిస్తున్న తీవ్ర వైఖరి, కెనడాను అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా మారుస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కెనడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కెనడా ఎగుమతులలో 72 శాతం అమెరికాకే వెళ్తుండటం, మరోవైపు అమెరికాలో కూడా మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ పెరుగుతున్న జీవన వ్యయం వల్ల ప్రజలు అసంతృప్తితో ఉండటంతో ఈ వాణిజ్య యుద్ధం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read:హార్ముజ్..అమెరికా భూభాగమే!

