హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినందుకే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలోనే తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం పెట్టినందుకు కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో పేదలకు అందాల్సిన ప్రభుత్వ వైద్యం, విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని క్రిశాంక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పక్కనబెట్టి మెడికోవర్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని నిలిపివేసి రేవంత్ రెడ్డి కుమార్తెకు చెందిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా రూ. 50,000 కోట్లు ఎలా దోచుకుందో తాము ఆధారాలతో సహా సవాలు విసిరామని తెలిపారు.
తాము చేసిన ఆరోపణలు, బయటపెట్టిన ఆధారాలు తప్పని నిరూపిస్తే ఇకపై ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టనని బహిరంగ సవాల్ విసిరినా, ప్రభుత్వం నుంచి గానీ, రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని క్రిశాంక్ పేర్కొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపి 72 గంటలు గడుస్తున్నా సీఎం రేవంత్ కుటుంబం, దుంప శిరీష తదితరులు తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉంటున్నారని, సమాధానం చెప్పలేకనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Also Read:‘కాకా’లో బాలీవుడ్ నటుడు!

