నేను ఈ యూనిటీ ఫౌండేషన్ వైజాగ్ లో హూద్ హుద్ వచ్చిన సమయంలో మొదలు పెట్టాను. అలా చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కూడా భాదితులకు నా వంతు సాయం చేసాను. కానీ ఇప్పుడు అసలైన సమస్యపై దృష్టి సారించాలనుకుంటున్నాను. కొద్ది కాలంగా నా గుండెని తొలుస్తున్న విషయంపై పోరాడాలన్న ఆలోచనని ఆచరణలో పెట్టే సమయం వచ్చిందనుకుంటున్నాను.
అన్నం పెట్టే అమ్మను ప్రేమించడం ఎంత అవసరమో పండించే రైతును ప్రేమించడం కూడా అంతే అవసరం. కారణం ఏదైనా ప్రతి సంవత్సరం ఎన్నో బ్రతుకులు బలైపోతున్నాయి..ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఆలోచింది, ఆశించి ప్రయోజనం లేదన్న ఒక్క ఆలోచన నుంచి పండించే రైతుకు పట్టెడన్నం పెట్టాలన్న ప్రేమ నుంచి పుట్టుకొచ్చిందే ఈ “సేవ్ ద ఫార్మర్.”
నిజమే! నేను ఒక్కడినే. ఉన్నవి రెండే చేతులు. కానీ కొంతమంది కన్నీటినైనా తుడవగలనన్న నమ్మకం ఉంది. అందుకే అడుగుతున్నా. మన అందరి చేతులూ కలిస్తే ఎంత మంది అన్నదాతల కన్నీళ్ళు తుడవొచ్చు? ఈప్పుడు మీరు చేసే ఒక్క ఆలోచన ఒక చావుని ఆపొచ్చు..ఒక కడుపు నింపొచ్చు…ఒక బ్రతుకు చక్కబెట్టొచ్చు..
మీ సంవత్సర ఆదాయంలో ఒక రోజు సంపాదన ఒక కుటుంబాన్ని నిలబెట్టొచ్చు…ఇక ఏ నాగలీ మూగబోకూడదు…ఏ కష్టమూ కరిగిపోకూడదు…ఏ రైతన్నా బలైపోకూడదు…
రైతులను కష్టాల నుంచి కాపాడి అన్నదాత ముఖంపై చేదిరిపోయిన చిరు నవ్వును మళ్లీ తిరిగి రప్పించడమే మా యూనిటీ లక్ష్యం. ఇప్పటికే చాలా సంస్థలు ఈ సమస్యపై కృషి చేస్తున్నాయని తెలుసు. వాళ్ళతోబాటు నేను కూడా నా వంతు కృషి చేసి రైతు ఋణం తీర్చుకోవాలన్నదే నా తాపత్రయం.
ఈ ఆశయం లో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడం కోసం సమర్ధవంతంగా నడిపించగల ఐదుగురిని ఎంపిక చేసుకున్నాను. వారే శ్రీ కె.టి.ఆర్, రాజమౌళి, రానా, సాయి ధరమ్ తేజ్ మరియు జి.వి. కేశవ్..జై కిసాన్! జై జవాన్! జై హింద్!