గో రక్షణ పేరుతో మతోన్మాదులు చేస్తున్న ఆగడాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో భాగంగా మాట్లాడిన మోడీ …గో రక్షణ పేరుతో ప్రజలను చంపడం అమానవీయమని, ఇది దారుణమని… చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పి 24 గంటలు గడవక ముందే జార్ఖండ్‌లో మరో హత్య జరిగింది.
బీఫ్ తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. అతడి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జార్ఘండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలోని బజర్తంద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అలీముద్దిన్ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ అతడిని తీవ్రంగా కొట్టి కారుకు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దిన్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.