పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్ది గంటలకే ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు అగ్రశ్రేణి అధికారులను ఒక్కసారిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ చర్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందిస్తూ రోడ్డెక్కి నిరసనకు సిద్ధమయ్యారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నందిని చక్రవర్తిని పదవి నుంచి తప్పించారు. ఆమె స్థానంలో 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దుశ్యంత్ నరియాలాను కొత్త ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే రాష్ట్ర డీజీపీ పీయూష్ పాండే స్థానంలో సిద్ధ్ నాథ్ గుప్తాను నియమించారు.
ఇదే కాకుండా కోల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రతీమ్ సర్కార్‌ను కూడా బదిలీ చేసి ఆయన స్థానంలో అజయ్ కుమార్ నంద్‌ను నియమించారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాను కూడా తొలగించారు. ఎన్నికల వరకు వీరిని ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల్లో నియమించకూడదని కమిషన్ స్పష్టం చేసింది.
ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ సోమవారం సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఎన్నికల కమిషన్ చర్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో ఈ అధికారుల బదిలీలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
Also Read:2027 వరల్డ్ కప్ గెలవడమే టార్గెట్!

