పూణేకు చెందిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య (ఫియాన్సే), ఆమె ప్రియుడు కలిసి లోహగఢ్ కోటపై ట్రెకింగ్ చేస్తుండగా లోయలోకి నెట్టి దారుణంగా హత్య చేశారు. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న కేతన్ అగర్వాల్….జూన్ 18న పూణే సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన లోహగఢ్ కోట వద్ద లోయలో పడి మరణించాడు. మొదట దీనిని ట్రెకింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ పోలీసుల విచారణలో కేతన్ కాబోయే భార్య సియా గోయల్…ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా తేలడంతో ఈ కేసు సంచలన మలుపు తిరిగింది.
కేతన్‌ను ఒంటరిని చేసి తమ ప్లాన్ ప్రకారం పూణే కోట వద్దకు తీసుకురావడానికి సియా గోయల్ అత్యంత తెలివిగా వ్యవహరించింది. జూన్ 6న కేతన్, సియా మరియు ఆమె సోదరుడు కలిసి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, సియా పుట్టినరోజు జరుపుకోవడానికి బాలి (ఇండోనేషియా) వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి బయలుదేరారు.
అయితే విమానాశ్రయానికి వెళ్లే దారిలోనే కేతన్ పాస్‌పోర్ట్ మాయమైంది. నిజానికి సియానే రహస్యంగా ఆ పాస్‌పోర్ట్‌ను దొంగిలించి, ఒక హోటల్ వాష్‌రూమ్‌లో ముక్కలుగా చింపి ఫ్లష్ చేసేసింది. పాస్‌పోర్ట్ కనిపించకపోవడంతో బాలి పర్యటన రద్దయి వారు వెనక్కి తిరగాల్సి వచ్చింది. కేతన్‌ను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోవడానికే సియా ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
కేతన్, సియాలకు 2026 ఫిబ్రవరిలో పూణేలో నిశ్చితార్థం జరిగింది. మే 31న ఈ జంట మొదటిసారి లోహగఢ్ కోటకు వెళ్లినప్పుడే..సియా తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్ హత్యకు స్కెచ్ వేసింది. కుటుంబ సభ్యులు వద్దంటున్నా వినకుండా సియా పట్టుబట్టి కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లింది. జూన్ 14న అక్కడి ఎత్తయిన ప్రదేశం నుండి కేతన్‌ను కిందకు నెట్టేందుకు ఆమె ప్రయత్నించింది కానీ కేతన్ ఒక చెట్టును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు సియా సమయస్ఫూర్తితో స్పందిస్తూ… అక్కడ పాము ఉందని దాని నుండి కాపాడటానికే అతడిని నెట్టానని అబద్ధం చెప్పి నమ్మించింది.
సియా జూన్ 19న వచ్చే తన పుట్టినరోజు నెపంతో….జూన్ 18న కేతన్‌ను మళ్లీ లోహగఢ్ కోటకు ఒప్పించి తీసుకెళ్లింది. కేతన్ తండ్రి మొదట నిరాకరించినప్పటికీ… సియా ….కేతన్ తల్లికి వీడియో కాల్ చేసి నచ్చజెప్పింది. నిజానికి జూన్ 19న సియా పుట్టినరోజు కోసం కేతన్ కుటుంబం మహాబలేశ్వర్‌లోని ఒక లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసి, బంధువులందరికీ ఆహ్వానాలు కూడా పంపింది.
Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!
జూన్ 18న సియా, కేతన్ కోట ఎక్కుతుండగా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి బైక్‌పై అక్కడికి చేరుకుని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాడు. హత్య చేయడానికి వీరిద్దరూ ఒక ‘కోడ్ సిగ్నల్’ అనుకున్నారు. ప్లాన్ ప్రకారం సియా కేతన్‌ను కోటపై అత్యంత ఎత్తయిన ప్రదేశానికి తీసుకెళ్లి సమయం చూసి కింద కూర్చుంది. ఆమె కింద కూర్చోవడమే సంకేతంగా భావించిన చేతన్, వెనుక నుండి వచ్చి కేతన్‌ను లోయలోకి తోసేశాడు.
తమ కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న అగర్వాల్ కుటుంబం ఈ ఘాతుకంతో కుప్పకూలిపోయింది. కేతన్ తాత దేవి అగర్వాల్…సియా పుట్టినరోజు కోసం ఒక డైమండ్ నెక్లెస్‌ను కూడా కొన్నారు. నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేయగా….మావల్ తాలూకా కోర్టు వారికి జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

