పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల్లో ఆమె పార్టీ టీఎంసీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైదొలగుతున్నారు. అలాగే పార్టీ కీలక నేత సువేందు అధికారి నిన్న పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం దక్షిణ బెంగాల్ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ పదవికి రిటైర్డ్ కల్నల్ దీప్తాన్షు చౌదురి రాజీనామా చేశారు. ఈయన స్టేట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సెల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాజాగా ఈరోజు ఆయన అడుగుజాడల్లోనే మరో ఇద్దరు నేతలు నడిచారు. వారిలో ఎమ్మెల్యే శీలభద్ర దత్తా, మైనార్టీ సెల్ నేత కబీరుల్ ఇస్లాం ఉన్నారు.
24 గంటల వ్యవధిలో నలుగురు నాయకులు రాజీనామా చేయడంతో టీఎంసీలో కలకలం రేగుతోంది. మరోవైపు పార్టీకి చెందిన దిగువ స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో టీఎంసీకి రాజీనామా చేస్తుండటం గమనార్హం. వీరంతా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ పర్యటనకు ముందు ఈ రాజీనామాలు చోటుచేసుకుంటుండటం గమనించాల్సిన అంశం.
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో శీలభద్ర దత్తా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో తాను అన్ ఫిట్ అని భావిస్తున్నానని చెప్పారు. తాను టీఎంసీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి చేయలేదని అన్నారు. ప్రజల ఓట్లతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని… అందువల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే… తన ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.