పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందునుండి వెనుకంజలో ఉన్న దీదీ అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్‌లో ఆమె 1427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ఐదు రౌండ్ల పాటు ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. ఒక్కసారిగా వెనుకంజలోకి వెళ్లిపోవడం గమనార్హం. ఐదో రౌండ్‌లోనే సువేందు ఆధిక్యం 9 వేల ఓట్ల నుంచి 3 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని ఆయన కోల్పోయారు.
కాగా,పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ సంపూర్ణ అధిక్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 201 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెలవాల్సి ఉంది. ఇప్పటికే అంకంటే చాలా ఎక్కువ సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 85, వామపక్ష పార్టీలు 3, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో కొనసాగుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ, బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.