మాల్యా కేసును వాదించలేను:ఈసీ అగర్వాలా

238
- Advertisement -

భారతీయ బ్యాంకులకు దాదాపుగా రూ.9వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన  వ్యాపారవేత్త విజయ్‌మాల్యా కేసును ఇక మీదట వాదించను అని మాల్యా తరపున లాయర్‌ సూప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. తన క్లయింటు విజయ్ మాల్యా ఎక్కడున్నాడో తెలియడంలేదని అందుకే అతడి కేసును తాను వాదించలేనని న్యాయవాది ఈసీ అగర్వాలా నేడు సుప్రీంకోర్టుకు విన్నవించారు.

మాల్యా వ్యవహారంలో ఎస్బీఐకి సంబంధించిన కేసు నుంచి న్యాయవాదిగా తనను తప్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ మాల్యా నుంచి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేవని, తన ఈ-మెయిల్స్ కు మాల్యా నుంచి ఎలాంటి సమాధానాలు రావడంలేదని అగర్వాలా వివరించారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనానికి నివేదించారు. మాల్యా బ్రిటన్ లో ఉన్నట్టు మాత్రం సమాచారం ఉందని వెల్లడించారు.

ఎస్బీఐతో మాల్యా ఆర్థిక వివాదంపై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యాయవాది ఈసీ అగర్వాలా విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం, ఆయన ఈ విచారణ నుంచి వైదొలగేందుకు అవసరమైన ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. మాల్యా చిరునామా, అతడి ఈ-మెయిల్ ఐడీని కోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని న్యాయవాదిని కోరింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

ఆర్థిక అవకతవకలకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన మాల్యాను… భారత్ కు అప్పగించాలని 2020లోనే యూకే హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను బ్రిటన్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా అమలు చేయడం లేదు. భారత్ లో విచారణకు హాజరు కాకపోవడం ద్వారా మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడని భావించిన సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలుశిక్ష విధించింది. అంతేకాదు, మాల్యాను భారత్ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలకు స్పష్టం చేసింది. అయితే, బ్రిటన్ ప్రభుత్వ వైఖరి కారణంగా మాల్యా రాక ఆలస్యమవుతోందని కేంద్ర ప్రభుత్వం సూప్రీంకోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి..

టీఆర్ఎస్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు:కేటీఆర్

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం స్థాయిలు

- Advertisement -