ముమ్మరంగా మల్లన్న చెక్కులు..సీఎంకు పాలాభిషేకం

273
kcr palabishekam

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మల్లన్న సాగర్ భూనిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అధికార యంత్రాంగం ముందుకు కదిలింది. నాలుగోరోజు విజయవంతంగా అన్నదాతలకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు అధికారులు. పల్లెపహాడ్‌లో చెక్కుల పంపిణీకి వచ్చిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌,సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి,అధికారులకు రైతులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్లు,అధికారులను అన్నదాతలు శాలువాలతో సన్మానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం అందిస్తున్న సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పల్లెపహాడ్‌లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. మల్లేషం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం, తొగుట మండలం బ్రాహ్మణ బంజేరుపల్లి, రాంపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో చెక్కుల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన చెక్కుల పంపిణీ రాత్రి వరకు కొనసాగనుంది.

ఎర్రవల్లిలో 746 చెక్కులు మంజూరు కాగా.. సోమవారం రాత్రి వరకు 671 చెక్కుల పంపిణీ పూర్తి అయ్యింది. వీటిలో 546 కుటుంబాలకు ఒక్కొక్కరికి 7.50 లక్షల రూపాయల పరిహారం, 18 ఏండ్లు పైబడిన 154 మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 13 మందితో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామి రెడ్డి నియమించారు.