సమాజంలో ప్రజల భద్రత,సంక్షేమమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్‌లో 499 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం ఉదయం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మహమూద్ అలీ … ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణ రాష్ర్టం ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 7 పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేశామని….. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అన్నారు. ప్రత్యేక మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పోలీస్ శాఖ పని తనమే నిదర్శనం అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు ఉన్నతంగా ఉందని కితాబిచ్చారు. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజల పట్ల సరైన గౌరవం, మర్యాద ఇచ్చి, సరైన రీతిలో స్పందించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.