మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాను వీక్షించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హీరో మహేష్‌బాబు, దర్శకుడు కొరటాలశివను ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తిగతంగా ఈ సినిమాను తాను ఎంజాయ్ చేశానని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజాగా మిత్రుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాతో పాటు ప్రజా జీవితాన్ని గురించి కేటీఆర్ చర్చించారు. కేటీఆర్ స్టైల్‌ని ఫాలో అయ్యానని మహేష్ తెలిపారు. కేటీఆర్ తనకు మంచి మిత్రుడని….సినిమాల గురించి తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లు చెబుతాడని తెలిపారు.
మహేష్ బాబు యూత్ ఐకాన్ అని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా మహేష్, కేటీఆర్‌ని ఉద్దేశించి మీ ఇద్దరూ ఒకరి రోల్స్ ఒకరు ఛేంజ్ చేసుకుంటే.. కేటీఆర్‌ని ఏ సినిమా చేస్తారు అని.. అలాగే మహేష్‌ని ఏ ఫైల్ మీద మొదట సంతకం చేస్తారని ప్రశ్నించగా దీనికి వెంటనే కేటీఆర్ నేను హాలిడేకు వెళ్తాను అన్నారు. మహేష్ ఏం చేస్తాడో అని క్యూరియస్‌గా ఉందన్నారు. సంవత్సరంన్నరగా సినిమా చేశాను. మీ పని ఎంత కష్టమో నాకు తెలుసు నేను మీతో కలిసి హాలిడేకి వెళ్లడానికి ఇష్టపడతాను అన్నాడు మహేష్. నేనే మహేష్‌ని అయితే న్యూ లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తాను అని కేటీఆర్ చెప్పారు.