శ్రీమంతుడు సినిమా స్పూర్తితో కామారెడ్డిలో సుభాష్ రెడ్డి అనే రియల్టర్ దాదాపు రూ. 6 కోట్లతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ పాఠశాలను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో దీనిని నిర్మించానని దాత సుభాష్ రెడ్డి పేర్కొనడంతో.. ఆ చిత్రంలో నటించిన నటుడు మహేష్ బాబును పాఠశాలకు తీసుకువస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. సుభాష్ రెడ్డి గారు.. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో కామారెడ్డిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. మీరే నిజమైన హీరో.. మీలాంటి మరింత మంది సమాజానికి కావాలి అని ప్రశంసించారు. అంతేగాదు త్వరలో శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తాననని హామీ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామలో తాను చదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉండటంతో రూ.6 కోట్ల సొంత నిధులతో రియల్టర్ సుభాష్ రెడ్డి కొత్త భవనాన్ని నిర్మించారు.

