మహారాష్ట్రలో మరో 26/11 తరహా దాడికి కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా శ్రీవర్థన్ లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలోని పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే -47 రైఫిళ్లతో పాటు కాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దిగ్బంధించారు. దీంతో పాటు హరిహరేశ్వర్‌లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి.
శ్రీవర్ధన్‌లోని హరిహరేశ్వర్, భరద్‌ఖోల్ వద్ద పడవలు గుర్తించారు. హరిహరేశ్వర్ వద్ద పడవలో రెండు-మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. రెండు పడవల దగ్గర ఎవరూ కనిపించలేదు. పడవలో రైఫిళ్లు, బుల్లెట్లు లభించడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఇదే తరహాలో గుజరాత్ పోర్‌బందర్‌లో అనుమానిత పడవను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో దొరికిన ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా?.. ఎవరైనా వస్తే ఇప్పుడు ఎక్కడున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.