ప్రయాణికుల భద్రత..కీలక ఆదేశాలు!

8
- Advertisement -

ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని బస్సులు, క్యాబ్‌లు, టాక్సీల్లో అమర్చిన పానిక్ బటన్ వ్యవస్థలు వాస్తవంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది వెంటనే పరిశీలించాలని అధికారులు కు మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ నీలం గోర్హే ఆదేశించారు.

ప్రైవేట్ క్యాబ్‌లు, టాక్సీలు, బస్సుల్లో ఉన్న అత్యవసర బటన్‌లు పనిచేయడం లేదన్న ఫిర్యాదులు రావడంతో, నాగ్‌పూర్‌లోని విధాన భవన్‌లో జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా నీలం గోర్హే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్‌వార్, సీనియర్ అధికారులు, క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధి కేశవ్ ఖ్షిర్‌సాగర్ పాల్గొన్నారు.

మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ పానిక్ బటన్ వ్యవస్థలు ప్రవేశపెట్టినప్పటికీ, వాటి ప్రభావం క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో లేదని నీలం గోర్హే వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో రోజుకు కనీసం 15 వాహనాలపై తనిఖీలు నిర్వహించి, లైవ్ ట్రాకింగ్ డేటా ఆధారంగా లోపాలను సరిచేయాలని ఆమె ఆదేశించారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు వాహనాల్లో స్పష్టమైన సూచనలు ఏర్పాటు చేయాలని, పాంప్లెట్లు, ప్రకటనలు, ఇతర మీడియా మార్గాలను వినియోగించాలని సూచించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను ప్రారంభించాలన్న ప్రతిపాదనను కూడా ఆమె ఉంచారు.

రవాణా కమిషనర్ వివేక్ భీమన్‌వార్ వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 1,40,599 వాహనాల్లో పానిక్ బటన్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. వీటిలో 1,01,086 వాహనాల్లో మాత్రమే అవి సక్రమంగా పనిచేస్తుండగా, మిగతావాటిలో లోపాలు లేదా పనిచేయని పరికరాలు ఉన్నట్లు వెల్లడించారు. లోపాలున్న వాహనాల డ్రైవర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి సరిదిద్దే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Also Read:భారత్‌పై సుంకాలు అక్రమం..అమెరికా ఎంపీలు!

ముంబైలోని రవాణా శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఇప్పటివరకు ఈ పానిక్ బటన్‌ల ద్వారా 6,30,255 అలర్ట్‌లు అందాయి. అలర్ట్ వచ్చిన వెంటనే వాహన యజమానికి సమాచారం పంపిస్తారు. స్పందన లేకపోతే ఆ సమాచారాన్ని ‘112’ అత్యవసర సేవలకు పంపిస్తారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ సమయంలో పానిక్ బటన్ వ్యవస్థ అమరిక తప్పనిసరి అని రవాణా కమిషనర్ స్పష్టం చేశారు.

- Advertisement -