వ్యవసాయంతో రైతుల జేబులు నిండాలన్నదే కేసీఆర్ లక్ష్యం అన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజు పూణె సమీపంలో ఉన్న బారామతి వ్యవసాయ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి విజ్ఞాన కేంద్రంను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బారామతి కేవీకే వ్యవసాయ క్షేత్రం రైతుల ఆధునిక దేవాలయం. వ్యవసాయరంగంలో శరద్ పవార్, ఆయన సోదరుడు అప్పా సాహెబ్ పవార్ ల మూడు దశాబ్దాల కృషి ప్రశంసనీయమన్నారు. సాగును లాభసాటి చేయడానికి తెలంగాణలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆధునిక వ్యవసాయం వైపు మళ్లిస్తున్నాం.. సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. బారామతి కేవీకే సందర్శన అనుభవం నేర్చుకోవడానికి, అధ్యయనానికి, స్వీకరించడానికి, పాటించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
పశ్చిమ మహారాష్ట్ర, తెలంగాణలో ఒకే రకమైన సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి. బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో అనుసరిస్తున్న సాగు పద్దతులు తెలంగాణ రైతులకు అనవసరణీయం. ఇంతవరకు బారామతి గురించి వినడం జరిగింది.. ఇప్పుడు చూసి నేర్చుకోవడం బాగుంది.తక్కువ పెట్టుబడి, తక్కువ విస్తీర్ణం, ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల వైపు మళ్లాలి. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో అన్ని రకాల పంటలు పండించగలిగే అనుకూల పరిస్థితులున్న తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశగా మళ్లించాలి. తెలంగాణ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, రైతుభీమా, రైతుబంధు, విత్తన సబ్సిడీతో పాటు సాగు నీరు అందిస్తుందని మంత్రి అన్నారు.
1969 తెలంగాణ ఉద్యమ అద్యయనం కోసం శరద్ పవార్ హైదరాబాద్ వచ్చానని ఇంతకుముందు చెప్పారు. మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.. వారి తరపున రేపు పవార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతాను. బారామతి వ్యవసాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేంద్ర పవార్‌ను, సంస్థ సంచాలకులు, శాస్త్రవేత్తల కృషిని అభినందించి,వారి అతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మిబాయి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు.