మా గ్రామాలను తెలంగాణలో కలపండి..!

509
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తాము టిఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్ (Naigaon), బోకర్ (Bhokar), డెగ్లూర్ (Degloor), కిన్వట్ (Kinwat) , హథ్ గావ్ (Hathgaon) నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్ లోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన ఉద్యమ నాయకుడు, బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రికి తమ గోడు వెల్లబోసుకున్నారు.

kcr

‘‘మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేమంతా బాధల్లో ఉన్నాం. తెలంగాణలో రైతులకు ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల సహాయం రైతుబంధు పథకం ద్వారా అందుతున్నది. మా గ్రామాల్లో ప్రభుత్వం రైతులకు ఇలాంటి సాయమేదీ చేయడం లేదు. తెలంగాణలో రైతుబీమా అమలవుతున్నది. మహారాష్ట్రలో లేదు. తెలంగాణలో పేదలకు 2వేల రూపాయల పెన్షన్ వస్తున్నది.

మా రాష్ట్రంలో కేవలం 600 రూపాయలు మాత్రమే వస్తున్నది. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందుతున్నది. మా దగ్గర 8 గంటలు ఇస్తామని చెప్పి, ఆరు గంటలు మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, పండుగలకు దుస్తుల పంపిణీ లాంటి పథకాలు మహిళలను ఎంతో ఆదుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు లేవు. తెలంగాణలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా దగ్గర అద్వాన్నంగా ఉన్నాయి’’ అని వారు తమ బాధను వెలిబుచ్చారు.

‘‘సాగునీటి విషయంలో కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది. బాబ్లీ గ్రామంలోనే నీళ్లు లేవు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్.ఆర్.ఎస్.పి. నింపితే బ్యాక్ వాటర్ ద్వారా తమ గ్రామాలకు ఎంతో కొంత మేలు కలిగే వాతావరణం ఉంది’’ అని వారు వివరించారు.

పక్కపక్కనే తమ గ్రామాలున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఎంతో తేడా ఉంది. తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి, తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని గతంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన 40 గ్రామాల ప్రజలు తీర్మానం చేశామని వారు చెప్పారు. దీంతో అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. తక్షణం 12 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ నేటికీ ఒక్క రూపాయి రాలేదన్నారు.

‘‘ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా అమలు చేయలేని పక్షంలో మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నాం. ఈ డిమాండుతోనే ఉద్యమం చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. కేసీఆర్ అవకాశం కల్పిస్తే టిఆర్ఎస్ పార్టీ టికెట్ పైనే ఎన్నికల్లో పోటీ చేస్తాం’’ అని వారు ప్రకటించారు.

నిజాం కాలంలో తామంతా హైదరాబాద్ రాజ్యంతోనే ఉన్నామని, ఇప్పటికీ నిజాం ఖాస్రాపాణీలతోనే భూ రికార్డులు సరిచూసుకుంటున్నామని, తమ గ్రామాల్లోనూ బతుకమ్మ, బోనాల పండుగ నిర్వహిస్తామని వారు వెల్లడించారు. తెలంగాణ ప్రజలతో తమకు తరతరాల అనుబంధం ఉంది కాబట్టి, తమ గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండు సహేతుకమైనదని వారు అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో కలిసి వచ్చి కేసీఆర్ ను కలుస్తామని వారు వెల్లడించారు.

నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు, బీవండి, షోలాపూర్, రజూర తదితర ప్రాంతాల నుంచి కూడా టిఆర్ఎస్ టికెట్ కావాలని అడుగుతున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి, తమ గ్రామాల్లో కూడా అలాగే జరగాలని అక్కడి ప్రజలు కోరుకోవడం సహజమని, ఆయా గ్రామాల సమంజసమైన కోరికను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -