మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఓ భూ వివాదంలో రామచంద్రారెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తుంది. షాద్‌నగర్ మండలం అన్నారానికి చెందిన రాంచంద్రారెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలో ఆయనకు ఉన్న భూముల్లో 9 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమి వివాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఓ యువకుడితో కలిసి బైక్‌పై వచ్చిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డి కారును అడ్డుకున్నాడు. డ్రైవర్ ను బెదిరించడంతో అతడు పారిపోయి పోలీసులకు సమాచారం అందించాడు.
రాంచంద్రారెడ్డి కారులోనే అతడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకోగా వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. రాంచంద్రారెడ్డి ఫోన్ లొకేషన్ ఆధారంగా చివరికి కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే రాంచంద్రారెడ్డి హత్యకు గురయ్యారు. రాంచంద్రారెడ్డి గతంలో జడ్చర్ల (బాదేపల్లి) మాజీ సింగిల్ విండో చైర్మన్ గా పని చేశారు.