ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నది గుండా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌లోకి ప్రస్తుతం 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 863.90 అడుగులకు చేరుకోగా, దీని పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 118.62 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.
వరద ప్రవాహం స్థిరంగా వస్తుండటంతో అధికారులు శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. తెలంగాణ పరిధిలోని ఈ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 4,267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read:ఎర్రసముద్రంలో భారత నౌకపై దాడి
ఎగువన ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహాల ఆధారంగా రాబోయే గంటల్లో శ్రీశైలానికి ఇన్ ఫ్లో మరిన్ని క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉందని, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి వేగంగా చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

