క్యాస్టింగ్ కౌచ్ అంటే మొన్నటి వరకు తెర వెనుక మాత్రమే వినిపించేది. ఎవరు కూడా బయటకి వచ్చి చెప్పేవారు కాదు. కానీ ఎప్పుడైతే హాలీవుడ్ లో ఆ వివాదం తారా స్థాయికి చేరిందో ఇండియాకి కూడా ఆ గాలి గట్టిగా వీచింది. వెంటనే ఎవరికీ వారు సోషల్ మీడియాలో మీటూ అనే ట్యాగ్స్ తగిలించేశారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నాయని రీసెంట్ గా కొంతమంది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు చేయడం లేదని, హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురు అవుతున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. తాను ఎప్పుడు కూడా టాలీవుడ్ లో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే హీరోయిన్ మాధవీలత రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
మాధవి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ పచ్చి అబద్ధాలు చెబుతోందని, టాలీవుడ్ లో హీరోయిన్లకు వేధింపులు నిజమని, అయితే, అవకాశాలు పోతాయన్న భయంతో ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్ ని ఎలా రూపుమాపాలో చర్చించి ఆలోచించాల్సిన సమయంలో, ఆ సంస్కృతి అసలే లేదని చెప్పడం తప్పని, సినీ అభిమానులను, ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే రకుల్ ఈ అబద్ధాలు చెప్పినట్టుందని అభిప్రాయపడింది.