తెలంగాణలో నామినేషన్ల సమయం దగ్గర పడుతుంటంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు క్షేత్రస్ధాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించారు. అదేంటి శ్రీకాకుళంలో ప్రచారం నిర్వహించడం ఏంటీ అనుకుంటున్నారా..?అవును నిజమే.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు బియ్యం,బట్టలు,దుప్పట్లను అందజేశారు. దీంతో పాటు అంజనేయపురం, పాలెం గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు కష్టజీవులని చెప్పిన ఆయన అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతు సాయం చేయటానికి వచ్చానని తెలిపారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు దాదాపుగా నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తూ ఉంటారు. వారి సాయం చేయడంతో పాటు ప్రచారం చేసినట్టు ఉంటుందని ఆయన శ్రీకాకుళం వెళ్లారు. మొత్తంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కృష్ణారావు చేసిన ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాన్ని వేచిచూడాలి.