‘మా’ ఎన్నికలు: అభ్యర్థుల తుది జాబితా ఇదే

126
- Advertisement -

మరికొద్ది రోజుల్లో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈసారి ‘మా’కు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్ అక్టోబర్ 10న జరగనుంది. దీనికి సంబదించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, అక్టోబర్ 2వ తేదీతో నామినేషన్‌ ఉపసంహరణకు గడువు పూర్తికాగా తాజాగా ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు.

ఇక ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి విష్ణు ప్యానల్‌ నుంచి బాబూ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ పోటీ చేస్తున్నారు. ఇక వైస్‌ ప్రెసిండెంట్‌ పదవులకు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బెనర్జీ, హేమలు, విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి, పృథ్వీ రాజ్‌ పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీకి పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు; కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు; రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. ఇక అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలకు అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.

- Advertisement -