చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు..

128
- Advertisement -

ఐపీఎల్ 2021లో సంచలన విజయం నమోదయ్యింది. గతంలో భారీ స్కోర్లు సాధించలేక సతమతం అయిన రాజస్థాన్ రాయల్స్ గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 190 పరుగులకే అలవోకగా ఛేదించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ సత్తాచాటింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నైని కంగుతినిపించింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. అయితే, ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం మిగతా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది.

అబుదాబి వేదికగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 190 పరుగుల విజయ లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. తొలుత ఎవిన్ లూయిస్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు), యశస్వి జైశ్వాల్ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) అదరగొట్టారు. తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించి లక్ష్య ఛేదనలో మార్గాన్ని సుగమం చేశారు. కెప్టెన్ సంజు శాంసన్ 28 పరుగులు చేయగా, శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ 8 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 14 పరుగులు చేయడంతో రాజస్థాన్ ఖాతాలో అపురూప విజయం చేరింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్థాన్ భారీ టార్గెట్‌ను ఊదిపడేసింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి దూకుడు కొనసాగించిన రుతురాజ్ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి అజేయ శతకాన్ని నమోదు చేశాడు. టీ20ల్లో రుతురాజ్‌కు ఇదే తొలి సెంచరీ. రుతురాజ్ చివరి 30 బంతుల్లో ఏకంగా 70 పరుగులు పిండుకున్నాడంటే అతడి దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 60 బంతులు మాత్రమే ఆడిన రుతురాజ్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 25, మొయీన్ అలీ 21, రవీంద్ర జడేజా 32 (నాటౌట్) పరుగులు చేయడంతో చెన్నై భారీ స్కోరు సాధించగలిగింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై ఇంత భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక చెన్నై చేతులెత్తేసింది. ఫలితంగా ఐపీఎల్ సెకండ్ లెగ్‌లో తొలి ఓటమి చవి చూసింది. సెంచరీతో మెరిసిన రుతురాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

- Advertisement -