ప్రేమ నేరం కాదు..కేరళ మంత్రి!

13
- Advertisement -

కేరళ మంత్రి గణేష్ కుమార్‌ వ్యక్తిగత జీవితం సంబంధిత వివాదం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని సమాచారం. ఈ వివాదం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ప్రతిపక్షం రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశముందని స్థానిక మీడియా నివేదించింది.

గణేష్ కుమార్ భార్య బిందు మీనన్‌ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త మరో మహిళతో అనుచితంగా ఉన్నట్లు తాను స్వయంగా చూసినట్లు ఆమె పేర్కొన్నారు. ఒకసారి ఇంట్లోనే మరో మహిళతో కలిసి ఉన్నప్పుడు పట్టుకున్నానని, ఆ సమయంలో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా మంత్రి సిబ్బంది తన ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన గురించి తాను ముఖ్యమంత్రి కుమార్తె వీణకు కూడా సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

గణేష్ కుమార్ కేరళలోని కొల్లం జిల్లాలోని పఠాన్‌పురం నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కేరళ కాంగ్రెస్ (B) పార్టీ అధ్యక్షుడు. ఈ పార్టీని ఆయన తండ్రి, మాజీ మంత్రి బాలకృష్ణ పిల్లై స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఎల్‌డీఎఫ్ కూటమిలో భాగంగా ఉంది.

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన గణేష్ కుమార్ ఇవి తన వ్యక్తిగత విషయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం ఈ అంశాన్ని పెద్దది చేస్తోందని అన్నారు. ప్రేమ నేరం కాదు. ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

2013లో కూడా తన మొదటి భార్య యామినిని శారీరక హింస, వివాహేతర సంబంధాల ఆరోపణలు చేయడంతో అప్పటి ప్రభుత్వంలో మంత్రి పదవికి గణేష్ కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుత వివాదం కూడా కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Also Read:బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్

- Advertisement -