కోహ్లీ గైర్హాజరు..అభిమానుల్లో చర్చ!

11
- Advertisement -

2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌కు హాజరు కాకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత మాజీ కెప్టెన్లు ధోని , రోహిత్ శర్మ ప్రత్యేకంగా హాజరయ్యారు. వీరిద్దరూ వీఐపీ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించగా, వారిని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే మరో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ అక్కడ కనిపించకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది.

కోహ్లీ ఫైనల్‌కు ఎందుకు రాలేదనే విషయంపై రెండు ముఖ్య కారణాలు చెబుతున్నారు. మొదటిది అధికారిక బాధ్యతల అంశం. ధోనీ 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించగా, రోహిత్ శర్మ 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. అందువల్ల వీరిద్దరూ మాజీ టైటిల్ గెలిచిన కెప్టెన్లుగా అధికారికంగా ఫైనల్‌కు ఆహ్వానించబడ్డారు.

అయితే విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ను భారత కెప్టెన్‌గా గెలవలేదు. అందువల్ల ఈ కార్యక్రమంలో అధికారిక పాత్ర ఆయనకు లేకపోవచ్చు. మరో కారణం కుటుంబంతో గడపాలనే నిర్ణయం. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు దూరమవడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ, తాను పూర్తిగా క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత కొంతకాలం ప్రజలకు కనిపించకపోవచ్చని చెప్పారు. అందుకే ప్రస్తుతం ఆడుతున్నంత వరకు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను కోహ్లీ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇంటి నుంచే వీక్షించి భారత జట్టు విజయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్

- Advertisement -