టీనేజ్ అమ్మాయిల్లో ఒంటరితనం!

1
- Advertisement -

భారతదేశంలో కౌమారదశ (టీనేజ్) లో ఉన్న బాలికలు తీవ్రమైన భావోద్వేగ సవాలును ఎదుర్కొంటున్నారు. చుట్టూ కుటుంబం, పాఠశాల విద్యార్థులు, సోషల్ మీడియా స్నేహితులు ఎంతమంది ఉన్నప్పటికీ… లోలోపల తాము తీవ్ర ఒంటరితనానికి గురవుతున్నామని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితినే ‘కౌమార ఒంటరితనపు అంతరం’గా మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ సమస్యకు ప్రధాన కారణం పైకి కనిపించే సంబంధాలకు, లోతైన భావోద్వేగ బంధాలకు మధ్య ఉన్న వ్యత్యాసమే. ప్రస్తుతం డిజిటల్ యుగంలో నిరంతరం నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికీ, మనసు విప్పి మాట్లాడుకునే నిజమైన స్నేహాలు కరువవుతున్నాయి. అమ్మాయిలకు కుటుంబ వ్యవస్థలోనూ, సామాజిక వాతావరణంలోనూ ఎదురయ్యే ప్రత్యేక ఒత్తిళ్లు వారిని మరింత కృంగదీస్తున్నాయి. ఒకవైపు చదువులో రాణించాలనే భారం, మరోవైపు సమాజం నుంచి వచ్చే సాంప్రదాయక నియమాలు వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచకుండా అడ్డుకుంటున్నాయి.

అబ్బాయిలతో పోలిస్తే బాలికలు భావోద్వేగ సాన్నిహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా లేదా ఆలోచనలు కలవకపోయినా వారు త్వరగా నిర్లక్ష్యానికి గురైనట్లు భావిస్తారు. అలాగే, సోషల్ మీడియాలో ఇతరుల ఆకర్షణీయమైన జీవితాలతో తమను తాము పోల్చుకోవడం వల్ల ‘పరిపూర్ణంగా ఉండాలి’ అనే మానసిక ఒత్తిడి పెరిగి, తమ నిజమైన సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు.

ఈ ఒంటరితనాన్ని అధిగమించడానికి కుటుంబాల్లో మరియు పాఠశాలల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలి. తల్లిదండ్రులు కేవలం మార్కులు, క్రమశిక్షణపైనే కాకుండా పిల్లల మానసిక స్థితిపై దృష్టి పెట్టాలి. భయం, సంకోచం లేకుండా తమ మనసులోని బాధను పంచుకునేలా పిల్లలకు భరోసా ఇవ్వాలి. అలాగే డిజిటల్ స్క్రీన్ల కన్నా ప్రత్యక్ష పరిచయాలను, ఆటలు, ఇతర సృజనాత్మక అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చవచ్చు.

Also Read:ట్రంప్‌తో వాణిజ్య చర్చలు రద్దు!

- Advertisement -