లోక్‌సభలో ‘జీ రామ్ జీ’ బిల్లు ఆమోదం పొందింది. ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ఈ కీలక బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు తీవ్ర నిరసనకు దిగాయి. బిల్లు చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
బిల్లు ప్రజల హక్కులను హరించే విధంగా ఉందని, పేదల ఉపాధి అవకాశాలను తగ్గిస్తుందని విపక్షాలు ఆరోపించాయి. నిరసనలో భాగంగా కొందరు విపక్ష సభ్యులు సంబంధిత బిల్లు పత్రాలను చించి సభలో విసిరేశారు. ఈ ఘటనతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్ పలుమార్లు సభ్యులను శాంతించాలంటూ కోరినప్పటికీ, గందరగోళం కొనసాగింది.
ప్రభుత్వం తరఫున మంత్రులు మాట్లాడుతూ, జీ రామ్ జీ బిల్లు గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని, ఉపాధి అవకాశాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికార పక్షం వాదించింది.
అయితే విపక్షాలు మాత్రం ఈ బిల్లు ప్రజావ్యతిరేకమని, ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమని తీవ్రంగా విమర్శించాయి. ఈ వివాదాల నడుమే సభలో మెజార్టీతో బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
Also Read:చరిత్ర సృష్టించిన నాథన్ లైయన్

