Harish:యాసంగి పంట సాగు చేయాలా వద్దా?

9
- Advertisement -

వ్యవసాయానికి రైతులకు నిజంగా కావాల్సింది యూరియా, నీళ్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో రైతులను గందరగోళానికి గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. యూరియా సరఫరా సక్రమంగా చేయలేని ప్రభుత్వం, సాంకేతికత పేరుతో రైతుల ఉసురు పోసుకుంటోందని ఆరోపించారు. ఈ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

రైతులు వ్యవసాయం చేయాలా, లేక యాప్‌లు, మ్యాప్‌ల చుట్టూ తిరగాలా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు వ్యవసాయం చేయడమే తెలుసని, యాప్‌లు, గీప్‌లు వారికి తెలియవని అన్నారు. మళ్లీ ‘ఒరిజినల్ రైతు’ అనే పేరుతో కౌలు రైతుల నుంచి భూమి కౌలు ఇచ్చినట్లు రాసిస్తేనే యూరియా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. దీని వల్ల భూస్వాములు కౌలు ఇవ్వడమే మానేస్తారని, ఫలితంగా లక్షలాది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు.

మెదక్ జిల్లాలో యాసంగి పంట సాగు చేయాలా వద్దా అన్న దానిపై రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారని హరీష్ రావు తెలిపారు. యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత లేక రైతులు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారని అన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మత్తుల పేరుతో మొత్తం నీటిని ఖాళీ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో మరమ్మత్తులు చేసి ఉంటే, ఈరోజు యాసంగి పంటకు రైతులు ఇబ్బంది పడేవాళ్లు కాదని స్పష్టం చేశారు.

Also read:‘జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

అలాగే, యాసంగి రైతు బంధు పథకం సాగు చేసిన వారికే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి లీకులు ఇస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని, ఇది ఆరు నుంచి ఏడు నెలల పంట కాబట్టి పత్తి రైతులు ఒక్క పంటనే చేస్తారని గుర్తు చేశారు. అటువంటి పత్తి రైతులకు యాసంగి రైతు బంధు వర్తించదా? అని ప్రశ్నించారు. కందులు పది నెలల పంట, చెరుకు పదకొండు నెలల పంట, పసుపు పంట చేసే రైతులకు యాసంగి రైతు బంధు ఇస్తారా లేదా? అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -