ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రెడ్ జోన్లలో గట్టి నిఘాను పెట్టాలి. కరోనా కష్ట కాలంలో రైతాంగం నుంచి కొనుగోలు చేస్తన్న ధాన్యం నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. రైతులకు ముందుగానే వారు తేవాల్సిన ధాన్యం నాణ్యతపై అవగాహన కల్పించండి. తాలు లేకుండా చూసుకోండి. తూనికల్లో అవకతవకలకు తావీయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు ఇబ్బందులు రాకుండా చూడాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్త దితర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జనగామ, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4లక్షల 81వేల 345 ఎకరాల్లో ధాన్యం పండగా, 11లక్షల 68వేల 389 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 895 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఇప్పటి వరకు 566 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతా కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత వేగంగా ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అత్యధికంగా 188 కొనుగోలు కేంద్రాలకు 186 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయయని మంత్రి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలో 117కి 35, భూపాలపల్లి జిల్లాలో 182కి 15 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. అయితే, ఆ రెండు జిల్లాల్లో పంటలు ఆలస్యంగా వేశారని, దిగుబడులు కొద్ది ఆలస్యంగా వస్తాయని ఆలోగా, మిగతా కేంద్రాలు మొదలు పెట్టాలని చెప్పారు.
జనగామలో 186 సెంటర్లు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 182 సెంటర్లు పని చేస్తున్నాయి. మిగతా 4 సెంటర్లు త్వరలో పని చేసేలా చూడాలి. గన్నీ బ్యాగుల కొరత ఉందని రైతులు అంటున్నారు. మొత్తం 21 లక్షల గన్నీ బ్యాగుల్లో ఇంకా ఆరు లక్షల గన్నీ బ్యాగులు రావాల్సి ఉంది. కాబట్టి వాటిని వెంటనే తెప్పించాలని మంత్రి జనగామ జిల్లా కలెక్టర్ నిఖిలకు సూచించారు. మిల్లర్ల నుంచి కూడా గన్నీ బ్యాగులు తీసుకోవాలని మంత్రి సూచించారు. గోదాములను ప్రస్తుత దిగుబడి 2లక్షల 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువకు సరిపడా ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇక వరంగల్ రూరల్ జిల్లాలోనూ 86వేల 780 ఎకరాల్లో 2 లక్షల 8వేల 186 మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడులు వస్తాయని భావిస్తున్నామన్నారు. 117 సెంటర్లకు కేవలం 35 సెంటర్లు మాత్రమే ప్రారంభమయ్యాయని, మిగతా సెంటర్లను సాధ్యమైనంత తొందరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హరిత ను మంత్రి ఆదేశించారు. గన్నీ బ్యాగులు కొరత ఉందని రైతులు అంటున్నారని, ఆ పరిస్థితిని అదిగమించాలని సూచించారు.
రైతులకు ధాన్యం నాణ్యతా ప్రమాణాల మీద అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. తాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, పర్యవేక్షించాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.