లాల్ దర్వాజ బోనాలకు సిద్ధమైన పాతబస్తీ..

868
Lal Darwaza Bonalu 2019
- Advertisement -

తెలంగాణలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. లాల్ దర్వాజ బోనాలు రేపటి నుంచి ప్రారంభం కానుండగా ఈ సంవత్సరం 110వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే ఈ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహిని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని ఆపద గట్టెకిస్తే గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతోందని భక్తుల నమ్మకం. మహంకాళి అమ్మవారికి బోనం ఎత్తుకుని,అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది విశ్వాసం.

వేల సంఖ్యలో భక్తులు సింహవాహిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలతో లాల్ దర్వాజ పరిసర ప్రాంతాలు మార్మోగిపోనున్నాయి. బోనాల నేపథ్యంలో దీపకాంతులతో అమ్మవారి ఆలయాలు ముస్తాభయ్యాయి.

బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు పర్యవేక్షించడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

- Advertisement -