ఇకపై సర్వేలు చేయను:లగడపాటి

228
lagadapati

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే మళ్లీ తప్పింది. ఆయన ఉహలకు అందని విధంగా టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా లగడపాటిపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. దీంతో స్పందించిన ఆయన ఇకపై సర్వేలు చేయనని తెలిపారు.

ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసిన లగడపాటి ..డిసెంబర్‌ 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ,ఏప్రిల్‌ 2019లో ఏపీ అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నాను. కారణాలేమైనప్పటికీ ప్రజానాడి పసిగట్టడంలో వరుసగా రెండు సార్లు విఫలమైనందుకు గాను ఇక ముందు భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నానని చెప్పారు.

తాను కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి 2014లో ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకున్నాను. అప్పటినుండి ఏ రాజకీయ పార్టీలో చేరడంగాని,అనుబంధంగా వ్యవహరించలేదు. 2004 నుండి సర్వేలు ఒక వ్యాపకంగా అనేక రాష్ట్రాలలో చేస్తూ వాస్తవంగా మాకు వచ్చిన ప్రజానాడిని ఎవరికీ అనుకూలమైనా లేక వ్యతిరేకమైనా కూడా చివరికి నా సొంత పార్టీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వున్నా పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలకు తెలియజేశాను.

అలాగే ఏపీ,తెలంగాణలో కూడా తనకు అందిన సర్వే ఫలితాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాను. నా ఫలితాల వలన ఎవరైన,ఏ పార్టీ అయినా నొచ్చుకొని వుంటే మన్నించాలని లేఖ ద్వారా కోరారు. సీఎంగా బాధ్యతలు చేపడుతున్న జగన్‌ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూనే చంద్రబాబు నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు లగడపాటి.