రైతుల సమస్యలపై పోరాడితే..గృహ నిర్బంధాలా?

1
- Advertisement -

రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తిచూపుతూ, యూరియా పంపిణీలో అమలు చేస్తున్న లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి గారితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, రైతుల తరఫున ప్రశ్నించే నాయకులను అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుని, ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పడం దారుణమన్నారు. రైతులకు ఎరువులు అందించడం చేతకాకపోవడం ప్రభుత్వ వైఫల్యమైతే, ఆ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ముఖాన్ని బయటపెడుతోందని విమర్శించారు. యాప్‌ల పేరుతో రైతులను క్యూలలో నిలబెట్టి, రోజుల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం, రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందన్నారు. వ్యవసాయానికి అత్యవసరమైన యూరియా అందక రైతులు ఆందోళన చెందుతుంటే, వారి సమస్యలను వినాల్సిన ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతో స్పందించడం సిగ్గుచేటన్నారు.

రైతుల సమస్యలపై పోరాటం చేయడం నేరం కాదని, ప్రజల తరఫున ప్రశ్నించడం ప్రతిపక్షాల రాజ్యాంగబద్ధమైన హక్కని కేటీఆర్ స్పష్టం చేశారు. గృహ నిర్బంధాలు, అక్రమ ఆంక్షలు, బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులను గానీ, రైతులను గానీ భయపెట్టలేరని హెచ్చరించారు.

Also Read:వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్

- Advertisement -