దేశంలో మోదీ గ్రాఫ్‌ పడిపోతోంది-కేటీఆర్‌

277
- Advertisement -

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసినా కూడా సంపూర్ణ మెజార్టీ రాదని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని, ఎన్డీఏకు 150 కంటే ఎక్కువ సీట్లు రావని, కాంగ్రెస్ కు 100 స్థానాలు దాటవని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కు 16 మంది ఉంటే మరో 100 మందిని తోడుచేసుకుంటే బుల్లెట్‌రైలు హైదరాబాద్‌కు ఉరుక్కుంటూ రాదా? ఏపీలో పోలవరానికి జాతీయహోదా ఇచ్చారు.. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు అడిగినా ఇవ్వలేదు… రేపటి రోజున ఆ పరిస్థితి రావొద్దు అని కేటీఆర్‌ అన్నారు.

KTR

ఈ ఎన్నికల్లో తప్పకుండా భాజపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని, సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోని లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని అన్నారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ అంటే ఇష్టం లేని ప్రజలు కోట్లాదిమంది ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో విధిలేక కాంగ్రెస్‌, భాజపాలకు ప్రజలు ఓట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రాంతీయ పార్టీలుబలంగా లేనిచోటే కాంగ్రెస్‌, భాజపా తమ ఉనికిని చాటుతున్నాయి తప్ప మిగతా చోట్ల ఆ పార్టీలు కనుమరుగైపోయాయని చెప్పారు.

ఏపీలో ఆ రెండు పార్టీలూ అడ్రస్‌ లేకుండా పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు, జగన్‌, పవన్‌ మధ్య త్రికోణ పోటీ నెలకొందని చెప్పారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు అప్పగించబోయే 16కు మరో 116 మంది ఎంపీలు దేశంలో తోడయ్యే పరిస్థితి ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు బాగుపడితేనే దేశమూ బాగుపడుతుందనే అవగాహన ప్రజల్లో వస్తేనే హక్కులు సాధించుకోవచ్చని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని అన్నారు.

- Advertisement -