కరీంనగర్‌ నుండే పార్లమెంట్‌ శంఖారావం..!

222
ktr karimnagar
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు మరికొద్దిరోజులు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక తెలంగాణలో 16 ఎంపీ స్థానాలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ క్షేత్రస్ధాయిలో కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఎంఐఎం మద్దతుతో రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేసి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడంతో పాటు తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో కేటీఆర్‌ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసినా వ్యూహాన్నే లోక్ సభ ఎన్నికల్లో అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే నాటికే అభ్యర్ధులను సిద్ధం చేసేందుకు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్‌ల విజయావకాశాలతో పాటు ఇతర పార్టీల బలబలాలపై అంతర్గత సర్వేలు చేయించారు టీఆర్ఎస్ నేతలు.

టీఆర్ఎస్‌ అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న ఆదరణపై ఓ అంచానాకు వచ్చారు. దీనికి తోడు మార్చి మొదటి వారం నుంచి ఒక్కో లోక్‌సభ నియోజక వర్గం వారీగా పర్యటించనున్నారు కేటీఆర్‌. మొట్టమొదటి సన్నాహాక సమావేశం కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గంలో నిర్వహించబోతున్నారు.

హైద‌రాబాద్ మిన‌హా 16 లోక్‌సభ స్థానాల్లోని ప్రతి నియోజక వర్గంలో ఎన్నికల సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల ముఖ్యనేతలతో సన్నాహాక సమావేశం నిర్వహించడం,అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా గెలుపే లక్ష్యంగా నేతలను సన్నద్ధం చేయనున్నారు.

ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్‌ ఇవ్వడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లి ప్రచారం చేయనున్నారు.దీనికి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన నియోజక వర్గాల్లో ప్రత్యేక దృష్ఠి సారించి భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు కేటీఆర్‌.

- Advertisement -