గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన మంత్రి కేటీఆర్ మరో కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. రాష్ట్రంలో సెటిలర్లు ప్రభావం చూపే ప్రాంతాలతో పాటు,ఎదురుగాలి వీస్తున్న చోట్లా గెలుపు బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు సీఎం కేసీఆర్. ఓ వైపు గులాబీ బాస్ ప్రచారం మరోవైపు కేటీఆర్ ఇలా రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ అభ్యర్థులు ఎవరు హైదరాబాద్‌లో కనిపించకూడదన్న కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్ధాయిలో గ్రామాల్లో పర్యటిస్తున్నారు గులాబీ నేతలు.
కేసీఆర్ నిర్వహించే సభలతో సంబంధం లేకండా మిగితా నియోజకవర్గాల్లో కార్యకర్తలతో పాటు సమావేశాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. గ్రేటర్ పరిధిలోని కొన్ని స్ధానాలతో పాటు ఇబ్రహీంపట్నం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిటర్లను ఒప్పించటంలో ప్రధాన భూమిక పోషించిన కేటీఆర్ ఇప్పుడు కూడా సెటిటర్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని భావిస్తుంది టీఆర్ఎస్. నిత్యం అభ్యర్థులతో టచ్‌లో ఉండి వ్యూహాలు,తి వ్యూహాలతో అభ్యర్థులను రీచార్జ్ చేసే బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్. మొత్తంగా ఇంకా ప్రజాకూటమిలో సీట్ల పంపకాలు ఓ కొలిక్కిరాకపోగా కూటమి ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో రోజురోజుకి ఢీలా పడిపోతున్నాయి విపక్షాలు.