ప్రపంచ దేశాలు తమ పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షనీయమైన గమ్యస్థానంగా భావిస్తున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. సౌదీ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ లో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి కేటీఆర్…ప్రపంచ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పారిశ్రామిక మరియు పెట్టుబడి స్నేహపూర్వక విధానాల వలన ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం గత ఏడు సంవత్సరాలుగా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి, ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించగలిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు సౌదీలోని భారత రాయబార కార్యాలయం తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ పేరిట ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సౌదీ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి కంపెనీలతో పాటు సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వంటి పారిశ్రామిక సంస్థలతో కలిపి ఈ పెట్టుబడి మీట్ ఏర్పాటు చేసింది. ఈరోజు, రేపు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపైన, పరిశ్రమల శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులు సౌదీ పెట్టుబడిదారులకు సమగ్ర వివరాలు అందిస్తారు.
ఈ సదస్సు ప్రారంభాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఈ రోజు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన టిఎస్-ఐసాస్ వంటి సింగిల్ విండో అనుమతుల విధానం కలిగి ఉన్నదని, ఈ విధానం ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సుమారు 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, తద్వారా 1.5 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పలు రంగాలను ఎంచుకుని, ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సౌదీ కంపెనీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సౌదీ వంటి అరబ్ దేశాలతో భారతదేశానికి అవినాభావ సంబంధం ఉన్నదని, దేశంలోని లక్షలాది మంది అరబ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. సౌదీతో తెలంగాణ రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు బలోపేతం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సౌదీ రాయబారి అసఫ్ సయీద్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నూతన రాష్ట్రం అయినప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని, దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా భారత రాయబారి అశోక్ సయూద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కే.తారకరామారావు ప్రత్యేక చొరవతో సౌదీ లో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపైన ఒక బ్రిడ్జిగా పని చేయాలని గతంలో కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా తాము నిర్వహిస్తున్న తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ ద్వారా తెలంగాణకి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు మరియు ప్రభుత్వ పాలసీలను సౌదీలోని కంపెనీలకు పరిచయం చేస్తామని తెలిపారు.
ఈ ప్రారంభ సెషన్ కార్యక్రమంలో సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖతానీ, సౌదీ ప్రభుత్వానికి చెందిన మహమ్మద్ అల్ హస్నా, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నీతి అయోగ్ కి చెందిన అడిషనల్ సెక్రటరీ రాకేష్ సర్వాల్, టి ఎస్ ఐఐసి యండి వెంకట నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.