హైదరాబాద్ లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి 27 నాటి ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 27 న జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామన్నారు. కౌన్సిలర్ లకు విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే తమను గెలిపించుకుంటారన్నారు కేటీఆర్.
బిఆర్ఎస్ సాధించిన విజయాలు అసమాన్యమైనవి అనితరసాధ్యమైనవి…. 2017 జిహెచ్ఎంసి ఎన్నికల్లో 150 కి గాను 99 కార్పొరేట్ స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టించింది అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో క్లీన్ స్వీప్ చేసాం. 2020 జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే విజయం సాధించాం… 2023 అసెంబ్లీ ఎన్నికల్లోను ఓఆర్ఆర్ లోపల గులాబీ జెండానే ఎగిరింది. కాంగ్రెస్ కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు అన్నారు.
హైదరాబాద్ ప్రజల ముందు కాంగ్రెస్, బిజెపిల మాయమాటలు, దొంగనాటకాలు పనిచేయలేదు… హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి హైదరాబాదులో అరాచకం సృష్టించాడు… రేవంత్ రెడ్డి అన్న ఇంటిని కూల్చలేదు. ధనవంతుల ఇళ్ళను ముట్టుకోలేదు. గరీబోళ్ల ఇండ్లను మాత్రమే హైడ్రా ధ్వంసం చేసిందన్నారు. కోర్టు సెలవులను చూసుకొని మరి పేదల మీద హైడ్రా ప్రతాపం చూపించింది…హైకోర్టు మొట్టికాయలు వేసిన హైడ్రా తన పనితీరు మార్చుకోలేదు అన్నారు. హైడ్రా దెబ్బకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనమైంది. లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఎంతోమంది పేదల కడుపు మీద కాంగ్రెస్ కొట్టింది అన్నారు.
Also Read:
ఎన్టీఆర్ బర్త్ డే..నీల్ ట్రీట్!
బెంగళూరు చెన్నై ముంబై లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి చేతగానితనంతోనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఒక్క నిర్మాణరంగం తో ఇంకెన్నో రంగాలు ముడిపడి ఉంటాయి..ఆరు గ్యారెంటీల అమలుకు పైసలు లేవని చెప్పే ముఖ్యమంత్రి లక్షన్నర కోట్లు పెట్టి మూసిని సుందరీకరిస్తానని చెప్తున్నాడు అన్నారు.

