నానక్ రామ్ గూడ భవనం కూలిన ఘటనలో బాధ్యులు మంత్రి బంధువైన వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఘటనా స్దలాన్ని సందర్శించిన కేటీఆర్…ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారాన్ని ప్రకటించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కేటీఆర్..నిర్వాసితులకు పునరావాసం ప్రకటిస్తామని తెలిపారు.
శిథిలాల కింద 13 మంది చిక్కుకున్నారని తెలిపారు. ఘటనకు బాధ్యులుగా టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌ను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎండీఏలో జరుగుతున్న అక్రమ కట్టడాలను 12 బృందాలు పరిశీలించి కూలగొడుతున్నయని మంత్రి పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు.
బిల్డర్ల దురాశతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ స్థలంలో భారీ భవంతిని నిర్మిస్తుండటం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. నిందితుడు, భవన యజమాని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన శబరిమల వెళ్లినట్టు చెబుతున్నారని, ఎలాగైనా ఆయన్ను అరెస్ట్ చేసి తీరుతామని అన్నారు.
సహాయక సిబ్బంది ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసింది. మిగతావారిని కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. ప్రమాద స్థలంలో ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామన్నారు.