తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమంతోపాటు, గుండ్లపోచంపల్లి మరియు పాశమైలారం అప్పారెల్ ఎక్స్ పోర్ట్ పార్కుల పనుల పురోగతి పైన టెక్స్టైల్ శాఖ మంత్రి కెటి రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో టెక్స్టైల్ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన 90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్‌ని కచ్చితంగా బతుకమ్మ పండగకు కనీసం వారం రోజులు ముందు సెప్టెంబర్ మాసాంతానికి అందివ్వాల్సిందేనని ఈ సందర్భంగా మంత్రి తెల్చిచేప్పారు.
ప్రస్తుతం చీరలను వేస్తున్న వేగాన్ని, లూమ్లను మరింతగా పెంచి డబుల్ షిఫ్టుల్లో పని చేయాలని కోరారు. సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపైన చీరల నేత కార్యక్రమం నడుస్తుందని మంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. అయితే నిర్ణీత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకునేందుకు కనీసం 20,000 లూములపైన చీరల ఉత్పత్తి జరగాల్సి ఉందని ఈ మేరకు త్వరలోనే ఉత్పత్తి రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా సిరిసిల్ల మాక్స్ సొసైటీ సంఘ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ ఆడబిడ్డలకు పండగ సందర్భంగా ఒక చిరు కానుక ఇవ్వాలన్న లక్ష్యంతో పాటు, సిరిసిల్లాలోని నేతన్నలకు ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు అదాయం పెంచి, వారి జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చేపట్టారని, ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన బతుకమ్మ చీరల అర్డరును నిలబెట్టుకొని సరైన గడువులోగా వాటిని పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
చీరల ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించేదుక తన కార్యాలయంతోపాటు టెక్స్టైల్ శాఖ కమిషనరేట్ నుంచి పర్యవేక్షించాలని, ఈమేరకు వారంలో కనీసం 4సార్లు సిరిసిల్లలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని నేతన్నలకు బ్యాంకు రుణాల సదుపాయంతోపాటు, ముద్ర లోన్లు మంజూరీ, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు బ్యాంకుల ప్రతినిధులు అధికారులతో ఒక సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీ రామారావు తెలిపారు.
ఈ సందర్భంగా సిరిసిల్లా లోని పవర్లూమ్ కార్మికులు తయారు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ మంత్రి పరిశీలించారు. వచ్చేవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మ్రితి ఇరానీ కలుస్తానని పవర్లూమ్ అప్ గ్రేడేషన్ పథకంలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్ళను అమె దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సిరిసిల్ల నేతలకు హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలోనే మంత్రి గుండ్ల పొచంపల్లి, పాశామైలారంలోని అప్పారెల్ పార్కుల పైన సమీక్ష నిర్వహించారు. ఈ పార్కులో అప్పారెల్ రంగంతో సంబంధం లేకుండా ఇతర కార్యకాలపాలు నిర్వహిస్తున్న వారి నుంచి భూమిని తిరిగి తీసుకుని అప్పారెల్ రంగానికి కేటాయించాలని టియస్ ఐఐసికి గతంలో ఇచ్చిన అదేశాల అమలును తెలుసుకున్నారు. ఇప్పటికే అలాంటి వారికి నోటీసులు జారీ చేశామని, చాల మంది కొంత గడువు ఇస్తే తిరిగి అప్పారెల్ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని అధికారులు మంత్రికి తెలిపారు.
ఈ మేరకు వారి నుంచి హమీ పత్రాలను తీసుకొవాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. దీంతోపాటు గుండ్లపోచంపల్లి అభివృద్ది తాలుకు నమూనాలను, టెస్కో సంస్ద విస్తరణ ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సీజన్ హరిత హారంలో భాగంగా రెండు అప్పారెల్ పార్కుల్లో పెద్ద ఎత్తున మెక్కలు నాటాలని అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో టియస్ ఐఐసి అధికారులతోపాటు టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.