మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తిపై కసరత్తు నిర్వహించారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంతో పాటు మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీ పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ఉండాలన్నారు.
ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషన లైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం ఉండాలన్నారు. ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత ఇస్తామని… పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలన ప్రతిఫలాలు అందాలన్నారు.
నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం అన్నారు కేటీఆర్. హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

