లోకేష్‌కు కేటీఆర్‌ పంచ్‌..!

139
KTR Punch to Nara Lokesh
KTR Punch to Nara Lokesh

సోమవారం జగిత్యాలలో జనహిత సభకు వెళుతూ పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం – అందులోనూ ఐటీ – మునిసిపల్ శాఖలను తీసుకోవడంపై పాత్రికేయులు ప్రస్తావించగా… లోకేష్ గతంలో తనను నాన్ లోకల్ మిమర్శించి హైదరాబాద్ లో పుట్టిన తాను మాత్రమే లోకల్ అని చెప్పాడని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టడం ద్వారా ఎవరు ఎక్కడున్నారో ఎవరు తెలంగాణ కోసం ఉన్నారో అర్థం అయిందని కేటీఆర్ అన్నారు. లోకేష్ ఏపీ కేబినెట్ లో చేరగానే తెలంగాణలో టీడీపీ మూత పడిందని అర్ధమని ఎద్దేవా చేశారు.

Lokesh

ఉద్దేశపూర్వకంగా జనహిత సభలు పెట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేవాడినని.. ఇప్పుడు నేరుగా వారిని కలిసే అవకాశం రావడం లేదన్నారు. దీంతో పురపాలక సంఘాల సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు ఆహ్వానిస్తే వీటిల్లో పాల్గొంటున్నానని తెలిపారు. త్వరలో సిద్దిపేటలో జరిగే సభలోనూ పాల్గొంటానని చెప్పారు. ఇప్పుడే సీఎం కావాలన్న కోరిక లేదన్న కేటీఆర్.. మరో పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారన్నారు. రాజకీయాల్లో 64 ఏళ్లు పెద్ద వయస్సు కాదని.. ఆయన ఇంకా యంగ్‌గానే ఉన్నారన్నారు. కేసీఆర్‌ నాయకత్వమే ఉండాలని హరీశ్‌ కూడా అంటున్నారన్న కేటీఆర్‌.. ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమేనన్నారు. ఎవరొచ్చినా రాష్ట్రంలో మాకు ఎదురేలేదని.. అసలు మాకు ప్రత్యామ్నాయమే లేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ మీద మొహం మొత్తింది. భాజపా మాకు పోటీయే కాదు. గుజరాత్‌లో గెలుస్తామనే పూర్తి నమ్మకం కూడా ఆ పార్టీకి లేదు. ముందస్తు ఎన్నికల కోసం భాజపా చూస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో పాగా కోసం పథకం వేస్తోంది. ముందస్తు ఎన్నికలకూ మేం సిద్ధమే. ప్రతిపక్షాలు వేలెత్తి చూపేందుకు ఇక్కడ అంశాలే లేవు. మా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు కేటీఆర్.