మహారాష్ట్రలో బీజేపీకి బలమైన పట్టున్న నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ నేత అభిజిత్ వంజారి మరోసారి విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహలేపై 3,271 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వంజారికి 67,231 ఓట్లు రాగా, కోహలేకు 63,960 ఓట్లు వచ్చాయి. దీంతో నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకుంది.
తన విజయంపై అభిజిత్ వంజారి స్పందిస్తూ.. నాగ్‌పూర్ ఇక బీజేపీ కంచుకోట కాదని, కాంగ్రెస్‌కు బలమైన స్థానంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంతో పాటు దేశంలోని యువత కాంగ్రెస్‌తో మళ్లీ అనుసంధానమవుతున్నారని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాలు, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నాలు యువతను ఆకర్షించాయని, ఈ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అభిజిత్ వంజారి వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన తండ్రి గోవిందరావు వంజారి దక్షిణ నాగ్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అభిజిత్ వంజారి రాష్ట్రీయ సంత్ తుకడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, న్యాయశాస్త్ర పట్టాలు పొందారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2002 వరకు విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, నాగ్‌పూర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికల్లో పరిశీలకుడిగానూ వ్యవహరించారు.
Also Read:తులాభారం షూట్‌లో రవితేజ
2005లో దక్షిణ నాగ్‌పూర్ ఉపఎన్నికలో పోటీ చేసి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో తూర్పు నాగ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైంది. అయితే, 2020లో నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిపై 18,910 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా మరోసారి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

